photo gallery

 

Saturday, May 30, 2015

'టీడీపీని చూసి టీఆర్ఎస్ భయపడుతోంది'

తెలుగుదేశం పార్టీని చూసి టీఆర్ఎస్ భయపడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ సమీపంలో గండిపేటలో జరుగుతున్న మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేశారు.  2019లో తెలంగాణలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మీ గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు సవాల్ విసిరారు. నీతి నిజాయితీగా రాజకీయాలు చేయాలని, కుట్రలు, కుతంత్రాలతో కాదని అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ భూముల విక్రయం సరికాదని చంద్రబాబు అన్నారు.

బాబు ఆయా.. జాబు గయా

బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు జీవన భృతి కింద రూ.2 వేలు చొప్పున అందజేస్తామని గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో మభ్యపెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఐదో ప్రాధాన్యత అంశంగా పొందుపరచడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పక్కన పెట్టుకొని మరీ పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వడం కొసమెరుపు.

బాబూ.. నీ ముఖం ఓసారి అద్దంలో చూసుకో!

‘‘సంపదను సృష్టించాను. దాన్ని కేసీఆర్ బాగా చూసుకోవాలి’’ అని మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని ఘాటుగా స్పందించారు. హైటెక్‌సిటీని కట్టి హైదరాబాద్ అభివృద్ధి అంతా తన ఘనతే అని చెబుతున్న చంద్రబాబు తన ముఖాన్ని ఓసారి అద్దంలో చూసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. మహానగర చరిత్ర 400 ఏళ్ల పైమాటే అని, అది తెలుసుకుని మాట్లాడాలన్నారు. దిక్కూ మొక్కు లేని ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టించుకుంటే బాగుంటుందని తలసాని చంద్రబాబుకు సూచించారు. అయ్యా.. కొడుకు పట్టిసీమలో ఎంత కొట్టేశారో తనకు తెలుసని, ఒక్క రోజు యోగా కోసం రూ. కోటి 25 లక్షలు ప్రభుత్వ నిధులను విడుదల చేస్తే ఎవరూ మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ట్విట్టర్ పిట్టీ మహానాడులో మాట్లాడుతుంటే కరెంటు పోయిందంట... ఇదీ ఇక్కడి పరిస్థితి అని అంటున్నాడు... ఇంట్లో ఎలా పడుకుంటున్నాడో’’అంటూ   లోకేశ్‌ను ఉద్దేశించి అన్నారు. రెండు గదుల బెడ్‌రూంలు ఐడీహెచ్ కాలనీలో తయారవుతున్నాయని  వెల్లడించారు.

Thursday, May 28, 2015

మహిళలు తిరగబడతారనే ఇక్కడ పెట్టారు'

ఆంధ్రప్రదేశ్ లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే  హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కూడా బాధిస్తోందని... వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు.

24 గంటల్లో ఆ ఎంపీలు రాజీనామా చేయాలి'

ఆంధ్రప్రదేశ్ రైల్వేకి ప్రత్యేక జోన్ ఇప్పట్లో వచ్చేట్లు కనిపించడం లేదు. బీజేపీ నేతలు విశాఖ వాసుల ఆశలపై నీళ్లు చల్లారు. మే 27 న విశాఖ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసి ప్రకటన విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. దీంతో ఆగ్రహించిన ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు బీజేపీ కార్యాలయం వద్ద గురువారం ఆందోళనకు దిగారు.

24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ ఇద్దరు ఎంపీల ఇళ్లు, కార్యాలయాలు ముట్టడిస్తామని ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ ఫోరం నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారంటూ ఫోరం సభ్యుడు చలసాని గాంధీ ప్రశ్నించారు.

Tuesday, May 26, 2015

మోసం చేయడం బాబు నైజం

ప్రజలను వంచించడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలముందు అధికారంలోకి రావడానికి అనేక హామీలను గుప్పించారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఏ ఒక్క హామీని అమలుపరిచిన పాపానపోలేదన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రులచేత, ఎమ్మెల్యేలచేత బురదచల్లించే ప్రయత్నాలు బాబు చేస్తున్నారన్నారు.   జగన్‌ను విమర్శిస్తున్న టీడీపీ నాయకులు ముందుగా తమ పార్టీ అధినేత  ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిలదీయాలన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని పోలీసుల సాయంతో అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేయండని మంత్రులే పార్టీ నాయకులకు పిలుపునివ్వడం హాస్యాస్పదమన్నారు.

గొంతులు లేస్తున్నాయి..

ఎన్నిలకప్పుడు పొత్తులు పెట్టుకున్న టీడీపీ, బీజేపీల మధ్య చిత్రమైన వాతావరణం నెలకొంది. తెలుగుదేశం ప్రభుత్వంపై బీజేపీ స్వరం మారుతోంది. మొన్న సోము వీర్రాజు, నిన్న మురళీధరరావు, ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ ...టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలకు బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. ఏపీ రాజధానికి భూ సేకరణతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. 

Monday, May 25, 2015

ఏం చేశారో!

ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హమీలను అమలు చేస్తున్నామని పలువురు రాష్ట్ర మంత్రులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు వారేం చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని శాసనమండలి సభ్యుడు, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి సవాల్ చేశారు. ఈ మేరకు ఆదివారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోలగట్ల మాట్లాడారు. ఎన్నికలకు  ముందు అమలుకు వీలుకాని హామీలు గుప్పించి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీ ప్రభుత్వం ఆ హమీలను నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాలన  ప్రారంభించిన ఏడాది కాలంలో  ఇప్పటికీ మోసపూరితంగానే నడుచుకుంటోందని మండిపడ్డారు.

26, 27 తేదీల్లో ‘జన్‌కల్యాణ్ సర్వ్: బీజేపీ

ప్రధాని మోడీ ఏడాది పాలనను పురస్కరించుకొని ఈ నెల 26, 27వ తేదీల్లో  ‘జన్ కల్యాణ్ సర్వ్’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని బీజేపీ జిల్లా కమిటీ నిర్ణయించింది. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రటించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ 26న జిల్లావ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో విజయోత్సవాలను జరుపుకుంటామని తెలిపారు.

 అదే విధంగా ఈ నెల 27న జిల్లా కేంద్రంలో ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు జరిగే కార్యక్రమానికి మాజీ మంత్రి కావూరి సాంబశివరావు హాజరవుతున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రధానీ చేయని అభివృద్ధిని ఒక ఏడాదిలో మోడీ చేసి చూపించారని, ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నేతలు పాకలపాటి సన్యాసిరాజు, డాక్టర్ పెద్దింటి జగన్మోహనరావు, ఇందుకూరి రఘురాజు, నిమ్మక జయరాజ్, పీవీవీ గోపాలరాజు, పి.అశోక్, ఎం.మధు, కెఎన్‌ఎం కృష్ణారావు, కుసుమంచి సుబ్బారావు, లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు.
 

రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఎవరో

రాష్ట్రాన్ని ముక్కలు చేసి  దుస్థితికి కారణమైందీ కాకుండా మళ్లీ కొత్త నాటకానికి తెరతీస్తే జనం నమ్మే పరిస్థితిలో లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఎండగట్టారు. పట్టణ సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేసిందంతా చేసి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితికి విభజనే శాపమంటూ ప్రజలకు తెలియజేస్తామని చంద్రబాబు చెబుతుంటే చాలా విడ్డూరంగా ఉందన్నారు. అసలు కేంద్రానికి విభజనలేఖ ఇచ్చింది మొ దలు శాశనసభలో జరిగిన అన్ని విషయాలు సీ మాంధ్రులకు తెలియదా అని ప్రశ్నించారు.

Sunday, May 24, 2015

అధైర్యపడొద్దు..అండగా ఉంటా

మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప ఎంపీవైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు. మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు.

ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు

సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు.  డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

Saturday, May 23, 2015

మాటలతో బాబు కాలయాపన

ఏడాది కాలంగా మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగట్టి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒత్తిడి చేయడానికే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి సమర దీక్ష నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూన్ 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు మంగళగిరిలో తలపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి సమరదీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలు శుక్రవారంనాడిక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.

విభజనే కారణం

ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  విభజన గాయాలను గుర్తుచేయనున్నారు. ఏడాదిలో ఏం సాధించామంటే చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో... విభజనవల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందన్న అంశంపై ప్రజల్లో భావోద్వేగాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.

Wednesday, May 20, 2015

కడియం చెప్పినా... బాబు కేబినెట్ స్పందించ లేదు

వరంగల్ నిట్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అవకాశం లేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పినా...ఏపీ సీఎం చంద్రబాబు ఆయన కేబినెట్ స్పందించకపోవడం వైఎస్ఆర్ సీపీ కొయ్య ప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో కొయ్యప్రసాదరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. నిట్ అంశంపై ఏపీకి జరుగుతున్న అన్యాయంపై టీడీపీ అనుసరిస్తున్న వైఖరి దుర్మార్గమని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీ సీట్ల ఫీజులు పెంచి... ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.

రైతులకు ఏనాడైనా మేలు చేశావా?

రుణమాఫీపై రైతాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా వంచించారంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏనాడూ రైతులకు మేలు చేసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రధానికి లేఖ రాయడంపై రఘువీరారెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

బాబు మోసాల్ని ఎండగట్టేందుకే జగన్ దీక్ష'

ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Tuesday, May 19, 2015

ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం

ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ను ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీకి నిరసనగా విద్యార్థులు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్శిటీ భూముల జోలికి వస్తే ఊరుకోమని వారు ఈ సందర్భంగా కేసీఆర్ ను హెచ్చరించారు.
అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా పార్శీ గుట్టలోని బస్తీ వాసులకు ఓయూ భూముల్లో నివాసాలు కట్టిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై వివిధ రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

వచ్చేనెలాఖరుకు ఇంజినీరింగ్ ప్రవేశాలు పూర్తి

:జూన్ నెలాఖరుకు  అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి చేయాలని,  దీనికి కళాశాలల యాజమాన్యాలు సిద్ధం కావాలని జేఎన్‌టీయూకే వైస్ చాన్స్‌లర్ వీఎస్‌ఎస్ కుమార్  సూచించారు.  విజయనగరం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో సోమవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో చేపట్టనున్న ఇంజినీరింగ్ ప్రవేశాలకు అన్ని   కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.  ఇటీవల నిర్వహించిన ఎంసెట్-2015 ఫలితాలను  ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు చెప్పారు. 

మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే

ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్ లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Monday, May 18, 2015

మోదీ, బాబు ప్రజలను దోచుకుంటున్నారు

కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు చమురు కంపెనీలతో కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి యడ్ల రమణమూర్తి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. దీని వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 4 శాతం ట్యాక్స్ విధించడం వల్ల వినియోగదారులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ధరల పెంపును నిరసిస్తూ... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు యడ్ల ఆదిరాజు, రొంగలి పోతన్న, కందిసాయి జగ్గారావు, కనకల రఘురామ్, తదితరులు పాల్గొన్నారు.

Friday, May 8, 2015

ప్రత్యేక హోదా ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉంది ధర్నాల వల్ల ఏపీకి వచ్చేది ఏమీ లేదు :వెంకయ్య

ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఆర్థిక, హోంశాఖ పరిధిలో ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. శుక్రవారం వెంకయ్య నివాసం ముందు విద్యార్థి జేఏసీ నేలు ఆందోళనకు దిగారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ ధర్నాల వల్ల ప్రచారం తప్ప ఏపీకి వచ్చేదేమీ లేదన్నారు. ప్రత్యేక హోదాపై త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రచారం కోసమే తనను టార్గెట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. తనను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అర్హత లేదని 14వ ఆర్థిక సంఘం చెబుతోందన్నారు. తాను కేంద్రంలో ఉంటే తెలుగు రాష్ర్టాలకు నెలకో ప్రాజెక్టు వస్తుందన్న వెంకయ్య చట్టంలో పేర్కొనని ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయంటే అందుకు తానే కారణమని తెలిపారు. అంతకు ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి జేఏసీ నేతలను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

మూడో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా పలుచోట్ల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల మధ్య ఘర్షణకు కొనసాగాయి. పలు చోట్ల పోలీసుల పహారా నడుమ బస్సులను నడిపించారు. కొన్ని డిపోల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని కార్మిక సంఘాలు నేతలు స్పష్టం చేశారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఏపీ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 255142 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఎంసెట్‌ పరీక్ష కోసం ఏపీలో 455, హైదరాబాద్‌లో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగనుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్‌ పరీక్ష జరుగనుంది. ఆర్టీసీ సమ్మెను సవాల్‌గా తీసుకున్న యంత్రాంగం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాలకు సజావుగా చేరుకున్నారు. అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.

Tuesday, May 5, 2015

బస్సులు బంద్

ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న మాదిరిగా తమకు 43 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ యూనియన్లు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆర్టీసీ బస్సు స్టీరింగ్‌ను లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కొంతకాలంగా అడుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యూనియన్లు హెచ్చరిస్తున్నాయి.

అగ్రికల్చర్‌ కళాశాల విద్యార్థుల రక్తదానం

జిల్లాలోని నైరాలో ఉన్న ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చర్‌ కాలేజీలో ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మంగళవారం రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న జిల్లా కలెక్టరు లక్ష్మీనరసింహం, కళాశాల ప్రిన్సిపాల్‌ జోగినాయుడు,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలన్నారు. ఈ శిబిరంలో 40 మంది కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.

ప్రపంచ బౌద్ధ క్షేత్రంగా సాగర్‌: కేసీఆర్‌

ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌ వెళ్లిరావాలనుకునే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని, తెలంగాణలో గొప్ప పర్యాటక కేంద్రంగా నాగార్జునసాగర్‌ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ శ్రీపర్వతరామ- బుద్ధవనం అభివృద్ధికి ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తామని, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకొని ఆయన సోమవారం నాగార్జున సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు. గౌతమ బుద్ధుడి స్మారకం వద్ద విగ్రహం వద్ద పుష్పాలు ఉంచారు. బౌద్ధ స్థూపం ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రాంగణంలో మొక్కలు నాటారు. బుద్ధవనం అభివృద్ధికి యాదాద్రి తరహాలో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల బుద్ధ విగ్రహాన్ని కూడా మంచి స్థానంలో నిలపాలని కేసీఆర్‌ సూచించారు.

ముఖ్యమంత్రి రాక రేపు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 6న జిల్లాకు రానున్నారు. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న సీఎం,   తోటపల్లి ప్రాజెక్టు పనులకు కూడా పరిశీలిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయనగరం చేరుకుని, తోటపల్లి ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 20వేల ఎకరాలకు సాగునీటిని ఈ ఖరీఫ్ నాటికే ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు  ప్రకటించారు. దీనిపై పలు వీడియో కాన్ఫరెన్సుల ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా చేయాలని, త్వరలోనే ఈ ప్రాజెక్టుపనులను పరిశీలిస్తానని కూడా చంద్రబాబు ఇటీవలే అన్నారు.